మంజీరా రచయితల సంఘం (మరసం) — నలభై వసంతాల అక్షర ప్రస్థానం (1986 - 2026)
ఒక చారిత్రక, సామాజిక, సాహిత్య సింహావలోకనం
“మానవతా భావుకత మా వస్తు శిల్పాలు - జీవితపు విలువలే మా అలంకారాలు
నూతన పనితనం ఎగురు విజయకేతనం - మంజీరా రచయితల సంఘం మాది” అంటూ
గొంతెత్తిన నినాదం నేటికీ నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ప్రజా సాహితీ క్షేత్రంలో ఒక దీపస్తంభంలా నిలబడిన 'మంజీరా రచయితల సంఘం' (మరసం) ఆశయాలకు, ఆదర్శాలకు ఇది సజీవ రూపం. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా 1986 జూలై 20వ తేదీన పురుడు పోసుకున్న ఈ సాహిత్య వేదిక డా. సినారె చేతుల మీదుగా ప్రారంభించబడింది. నేడు నలభై ఏళ్ల సుదీర్ఘ, సార్థక ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఒక మహావృక్షంగా నిలబడింది. మెతుకు సీమ గుండా ప్రవహించే మంజీరా నది పట్టణానికి దాహార్తిని, పంటపొలాలకు జీవజలాన్ని ఎలాగైతే అందిస్తుందో, ఈ మంజీరా రచయితల సంఘం కూడా తెలంగాణ సాహిత్య రంగానికి, సామాజిక చైతన్యానికి తన అక్షర జలాలను అంతే స్వచ్ఛంగా, నిర్విరామంగా అందిస్తూ వస్తోంది.
గత నాలుగు దశాబ్దాలుగా ప్రజాపక్షంగా, అణగారిన వర్గాల గొంతుకగా, అక్షర సాక్షిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న 'మరసం' సమాజంలోని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలను తన రచనలు, ప్రచురణలు, సాహిత్య కార్యక్రమాల ద్వారా అద్భుతంగా ప్రతిబింబించింది. ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులకు చేయూతనిస్తూ, వారి అస్తిత్వ సృజనకు ఒక బలమైన వేదికగా నిలిచింది. ఇప్పటివరకు 60కి పైగా విలువైన పుస్తకాలను ప్రచురించడం మంజీరా రచయితల సంఘం నిబద్ధతకు, అలుపెరగని సాహిత్య కృషికి నిలువెత్తు నిదర్శనం.
ఆవిర్భావ నేపథ్యం - సైద్ధాంతిక పునాదులు:
1980వ దశకం నాటికి తెలంగాణ సమాజం ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. భూస్వామ్య అవశేషాలు, పేదరికం, ఒకవైపు అస్తిత్వ ఆవేదన, మరోవైపు సాంస్కృతిక విధ్వంసం... ఈ నేపథ్యంలో సాహిత్యానికి ఒక నిర్దిష్టమైన సామాజిక బాధ్యత ఉందని నమ్మిన కొందరు ప్రగతిశీల భావాలున్న రచయితలు ఏకమయ్యారు. సాహిత్యం కేవలం వినోదానికి, కాలక్షేపానికి, లేదా పండితుల పాండిత్య ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాకూడదని వారు దృఢంగా విశ్వసించారు. "జీవితపు విలువలే మా అలంకారాలు" అని ప్రకటించి, సామాన్యుడి కష్టాన్ని, శ్రమను, స్వేచ్ఛాకాంక్షను తమ కవిత్వానికి వస్తువుగా మలుచుకున్నారు. అలా నాటిన చిన్న మొక్క, డాక్టర్ నందిని సిధారెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా... మార్గదర్శకత్వంలో ఎదిగి దశాబ్దాల పాటు తెలంగాణ సాంస్కృతిక, సామాజిక పోరాటాలకు సైద్ధాంతిక పునాదిగా మారింది.
మంజీరా ప్రచురణల మహా ప్రవాహం: మంజీరా రచయితల సంఘం ప్రచురించిన ప్రతి పుస్తకం ఆయా కాలాల నాటి సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టింది. పుస్తక ప్రచురణను ఒక ఉద్యమంగా చేపట్టిన దమరసం, తన తొలి వార్షికోత్సవం సందర్భంగా వెలువరించిన ‘మంజీరా ప్రథమ వార్షికోత్సవ సంచిక’తో తన ప్రచురణల ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. ఆలోచనలతో పాటు ఆచరణకు పెద్దపీట వేసింది. కట్న ప్రసక్తిలేని సభా లేదా ఆదర్శ వివాహాలని ప్రోత్సహించింది. సోలిపేట రామలింగారెడ్డి – సుజాతల వివాహం కాళోజీ నారాయణ రావు చేతుల మీదుగా, ఎన్. భగవాన్ రెడ్డి – వజ్రల వివాహం 1991 లో డా. సినారె చేతులమీదుగా జరిపించింది. బయ్యారం రాంరెడ్డి - పద్మ ... ఎన్. అఖిల్ రెడ్డి - పద్మల ఆదర్శ వివాహం జరిపించింది. e
ఆ తర్వాత పదేళ్ల సుదీర్ఘ కృషిని సమీక్షిస్తూ ‘పది వసంతాలు – మంజీరా రచయితల సంఘం’ సంచికను 20-07-1996న డా. సినారె గారిద్వారా ఆవిష్కరించింది. ఆ తదనంతరం రెండు దశాబ్దాల అక్షర పండుగను జరుపుకుంటూ ‘ఇరవై ఏళ్ల పరువళ్లు’ అనే మహా సంచికలను వెలువరించింది. ఇవి కేవలం సంస్థాగత నివేదికలు కావు, నాటి తెలంగాణ సాహిత్య గమనానికి కరదీపికలు.
సాహిత్య విమర్శ, అధ్యయనం రంగాల్లో కూడా మరసం చెరగని ముద్ర వేసింది. ప్రముఖ కవుల సాహిత్యంపై, వివిధ సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణలతో కూడిన వ్యాసాలను సమీకరించి ‘వ్యాస మంజీరా’ అనే గ్రంథాన్ని ప్రచురించింది. ఇది పరిశోధకులకు, విద్యార్థులకు ఒక ప్రామాణిక కృతిగా నిలిచింది. మంజీరా తీరంలోని కవుల అస్తిత్వ స్వరాలను, వారి స్థానిక యాసను, భాషను ప్రతిబింబిస్తూ ‘మంజీరా ఎడపాయలు’ కవితా సంకలనాన్ని వెలువరించింది. ఈ పుస్తకం మెతుకు సీమ కవుల సృజనాత్మకతను రాష్ట్ర స్థాయికి పరిచయం చేసింది.
1990ల దశకంలో ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు దేశీయ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ వృత్తులను చిన్నాభిన్నం చేస్తున్న తరుణంలో, ఆ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా తన నిరసన స్వరాన్ని కవిత్వంగా మలిచి ‘మొగులైంది’ కవితా సంకలనాన్ని ప్రచురించింది మరసం. ప్రపంచీకరణ దుష్పరిణామాలపై కవులు సంధించిన అక్షరాస్త్రం ఈ పుస్తకం.
ఈ ప్రచురణల క్రమంలో అత్యంత హృదయ విదారకమైన, చారిత్రాత్మకమైన ఘట్టం ‘పాట సంతకం’ ప్రచురణ. తెలంగాణ ఉద్యమ గాయని, పీడిత ప్రజల విముక్తి కోసం తన గొంతును ఆయుధంగా మలిచిన సాహసి 'beల్లి లలిత'. ఆమెను దారుణంగా, కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపిన విషాద సమయంలో, యావత్ తెలంగాణ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ సందర్భంలో ఆమె జ్ఞాపకార్థం, ఆమె నెత్తుటి ధారల నుండి రాలిన కన్నీటి చుక్కలను అక్షరాలుగా మలిచి, ఆమె ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా మరసం ‘పాట సంతకం’ కవితా సంకలనాన్ని వెలువరించింది. ఇది కేవలం కవితల పుస్తకం కాదు, ఒక అమర గాయనికి అక్షర నివాళి.
మరసం కేవలం కవిత్వానికే పరిమితం కాలేదు. తన గడ్డ చరిత్రను రికార్డు చేసే బాధ్యతను కూడా తీసుకుంది. అందులో భాగమే ‘మెతుకు సీమ చరిత్ర – సంస్కృతి’. ఉమ్మడి మెదక్ జిల్లా అస్తిత్వం, ప్రాచీన చరిత్ర, జానపద కళారూపాలు, ఆచార వ్యవహారాలు, సామాజిక జీవనాన్ని సమగ్రంగా పరిశోధించి వెలువరించిన ఈ పుస్తకం స్థానిక చరిత్ర అధ్యయనంలో ఒక మైలురాయి.
తెలంగాణ ఉద్యమంలో మంజీరా అక్షర గర్జన:
మంజీరా రచయితల సంఘం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది తెలంగాణ మలిదశ ఉద్యమంలో అది పోషించిన చారిత్రాత్మక పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీలు ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాని రోజులవి. ఆ సమయంలోనే మేధావులు, కవులు తీవ్ర మథనంలో ఉన్నారు. ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి తొలితీర్మానం చేసిన సంఘాల్లో మంజీరా రచయితల సంఘం అగ్రభాగాన నిలుస్తుంది. ఇది చారిత్రక సత్యం.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను, వారి సాంస్కృతిక అణచివేతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఆట, పాట, మాట అవసరమని గుర్తించిన మరసం ‘తెలంగాణం’ అనే పాటల పుస్తకాన్ని వెలువరించింది. ఈ పుస్తకంలోని పాటలు పల్లెపల్లెనా దండోరాలై మోగాయి. యువతను ఉర్రూతలూగించి ఉద్యమం వైపు నడిపించాయి. తెలంగాణ ఉద్యమం కోసం మంజీరా రచయితల సంఘం నిర్విరామంగా పనిచేస్తున్న సమయంలో, సమైక్యవాద శక్తుల నుంచి, అప్పటి రాజకీయ నాయకుల నుంచి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ వైతాళికుడు డాక్టర్ నందిని సిధారెడ్డి గారిని భౌతికంగా అంతమొందిస్తామని బెదిరింపులకు గురిచేసిన దుర్ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ, బెదిరింపులకు భయపడకుండా, ప్రాణాలకు తెగించి మంజీరా రచయితల సంఘం తన అక్షర యజ్ఞాన్ని, ప్రజా ఉద్యమ ప్రస్థానాన్ని మరింత వీరోచితంగా కొనసాగించింది.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను, వలస పాలకుల దోపిడీపై రగిలిన ఆగ్రహాన్ని, ప్రజల మనోభావాలను అక్షరబద్ధం చేస్తూ మరసం ప్రచురించిన మరో అద్భుత కవితా సంకలనం ‘మునుం’. పొలంలో ఒక వరస పట్టి కోత కోసుకుంటూ వెళ్లే విధానాన్ని 'మునుం' అంటారు. అలాగే ఉద్యమ పథంలో అడ్డంకులను ఛేదించుకుంటూ ముందుకు సాగాలన్న సందేశాన్ని ఈ పుస్తకం కవుల ద్వారా ఇచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా సాహిత్య, సాంస్కృతిక విశేషాలను పరిచయం చేస్తూ పలు ప్రచురణల ద్వారా ఆ ప్రాంత సాహిత్య చరిత్రను, ఉద్యమ నేపథ్యాన్ని భద్రపరిచే ప్రయత్నం చేసింది మరసం.
ప్రజా సమస్యలపై అక్షర పోరాటాలు: సామాజిక రుగ్మతలపై రాజీలేని పోరాటం చేయడం మరసం నైజం. సమాజాన్ని, ముఖ్యంగా గ్రామీణ పేద కుటుంబాలను పట్టిపీడించిన సారా (మద్యం) మహమ్మారికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కినప్పుడు, వారి పోరాటానికి అక్షరాల ద్వారా మద్దతు తెలుపింది. 09-10-1992లో మద్యపాన వ్యతిరేక కవిసమ్మేళనం నిర్వహించింది. , ప్రజలను మరింత చైతన్యపరిచే ఉద్దేశంతో కోమల్ రాసిన మద్యపాన వ్యతిరేక పాటలను ‘గెలిసి తీరాలి’ అనే పుస్తకాన్ని ప్రకటించింది. 1996 గుట్కా వ్యతిరేక ఉద్యమం, అందాల పోటీలకు నిరసనగా.., అశ్లీల సాంస్కృతికి వ్యతిరేకంగా.., పత్రికా స్వేచ్ఛపై దాడికి నిరసనగా., గద్దర్ పై కాల్పులకు వ్యతిరేకంగా... , రైతులారా ఆత్మహత్యలు చేసుకోవద్దు., అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా..., వరకట్న వ్యతిరేక ప్రదర్శనలు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
ఇది ఉద్యమకారులకు గొప్ప ఊరటను, ప్రేరణను ఇచ్చింది. ప్రజా సాహిత్యోద్యమంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన నిజాం వ్యతిరేక పోరాట యోధుడు, తొలితరం తెలంగాణ నవలా రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి జీవితాన్ని, ఆయన సాహిత్య కృషిని నేటి తరానికి పరిచయం చేస్తూ ‘ప్రజల మనిషి వట్టికోట’ అనే పుస్తకాన్ని వెలువరించింది. గతాన్ని గౌరవించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించగలమని మరసం ఈ చర్య ద్వారా నిరూపించింది. సంఘం 38 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా, నాటి నుంచి నేటి వరకు మరసం వేదికగా ఆవిర్భవించిన ఉత్తమ కవిత్వాన్ని ఒకచోట చేరుస్తూ ‘జోట పాటలు’ అనే కవితా సంకలనాన్ని అత్యంత ఆత్మీయంగా ప్రచురించింది.
ఆడియో క్యాసెట్లు : శివారెడ్డి కవిత,
జలపాతాలు – ప్రముఖ కంఠస్వరాలు.,
నాగేటి చాల్లల్లా దేశపతి శ్రీనివాస్ గారు ఆడియో క్యాసెట్ లు వివరించారు.
వీడియో క్యాసెట్ లు : కవిదృశ్యం
వర్తమాన సాహిత్య వైభవం - మురిసిన 'మంజీరా' (40వ ):
నలభై ఏళ్ల ముంగిట మంజీరా రచయితల సంఘం ఎన్నెన్నో మధురానుభూతులను, విజయాలను మూటగట్టుకుంది. ఈ సంఘానికి ప్రాణం పోసి, నాలుగు దశాబ్దాలుగా వెన్నంటి నడిపించిన మార్గదర్శకుడు, మహాకవి డాక్టర్ నందిని సిధారెడ్డి గారికి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' వరించడం మరసం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. ఈ పురస్కారం కేవలం ఆయనకు మాత్రమే కాదు, తెలంగాణ భాషకు, మంజీరా రచయితల సంఘం చేసిన నిస్వార్థ అక్షర కృషికి దక్కిన జాతీయ స్థాయి గౌరవం. ఈ అపూర్వ పురస్కారం పట్ల మరసం కవులు, రచయితలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆనందపు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
పుస్తక ప్రచురణల పరంపర ఈ 40వ ఏట కూడా అదే వేగంతో కొనసాగుతోంది. ఇటీవల కాలంలో మరసం వేదికగా వెలువడిన రచనలు సాహిత్య లోకంలో విశేష చర్చకు దారితీశాయి. సామాజిక పరిణామాలను కళ్ళకు కట్టిన ‘నాగటితరం’ (నవల), మారుతున్న గ్రామీణ జీవితానికి అద్దం పట్టిన పప్పుల రాజిరెడ్డి గారి విశిష్ట రచన ‘గంగాళం’, సమాజంలోని లోపాలను సూటిగా ప్రశ్నిస్తూ డాక్టర్ సిద్దెంకి యాదగిరి రచించిన వ్యాస సంపుటాలు ‘అచ్చు’, ‘ముక్వారు’, తైదల అంజయ్య ‘జలతంత్రి’ ఈ సంస్థ ప్రచురణల విలువను మరింత పెంచాయి.
వీటన్నింటితో పాటు ఇటీవల అత్యంత ఘనంగా ఆవిష్కరించబడిన మరో అద్భుత చారిత్రక దస్తావేజు డాక్టర్ పొన్నాల బాలయ్య రచించిన ‘లంద’ నవల. మూడు తరాల మాదిగ సామాజిక వర్గపు జీవన గాథను, వారి వృత్తి సంస్కృతిని, అణచివేతపై వారు చేసిన ఆత్మగౌరవ పోరాటాన్ని అత్యంత సహజంగా, వారి స్వచ్ఛమైన జీవద్భాషలో చిత్రించిన ఈ నవల దళిత సాహిత్యంలో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది. ఇవన్నీ మంజీరా రచయితల సంఘం అంచెలంచెలుగా ఎదుగుతూ తన సాహిత్య పరిధిని ఎంతగా విస్తరించిందో తెలియజేస్తాయి. మైత్రి సమ్మేళనం, కవిత్వంతో కలుద్దాం. కవిసమ్మేళనం , ‘తరంగం’ విశ్లేషణలు, మంజీరస్వరం పేరిట ఉపన్యాసాలు, నిర్వహించనైనది. గురువులు సిధారెడ్డి గారి ‘కవిత్వ నిర్మాణ పద్ధతులు’ 15 ప్రసంగాలు యూట్యూబ్, ఫేస్ బుక్ వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనైనది.
నలభై ఏళ్ల స్ఫూర్తి - ఒక మహా వృక్షపు నీడ: నాలుగు దశాబ్దాలుగా మంజీరా రచయితల సంఘం కేవలం ఏటా వార్షికోత్సవాలు చేసుకునే ఒక సాధారణ సాహిత్య సంస్థగా మిగిలిపోలేదు. అది ప్రజల జీవితాలను, సమాజంలో వస్తున్న మార్పులను, హక్కుల కోసం జరిగిన ఉద్యమాలను, అస్తిత్వ ప్రశ్నలను ఎప్పటికప్పుడు అక్షరబద్ధం చేసిన ఒక చైతన్య వేదికగా తన ప్రత్యేకతను, స్వచ్ఛతను నిలుపుకుంది.
1986లో కొంతమంది ఆదర్శ భావాలున్న యువకులతో నాటిన ఒక చిన్న సాహిత్య మొక్క, ఈ నలభై ఏళ్లలో పెనుగాలిని, వడగళ్ల వానలను తట్టుకుని నేడు ఒక మహావృక్షమై విస్తరించింది. మంజీరా రచయితల సంఘం స్ఫూర్తితోనే, ఆ తర్వాత కాలంలో రాష్ట్ర స్థాయిలో 'తెలంగాణ రచయితల వేదిక' (తెరవే), ఆ తర్వాత 'తెలంగాణ రచయితల సంఘం' లాంటి బృహత్తర సంస్థల ఆవిర్భావానికి సైద్ధాంతిక బీజాలు పడ్డాయి. మంజీరా రచయితల సంఘం ఎందరో కవులకు, రచయితలకు, గాయకులకు తన కొమ్మల కింద ఆశ్రయం ఇచ్చింది.
చరిత్ర పుటలు తిరగేస్తే... ఎన్నో అక్షరాలకు నీడనిచ్చిన వృక్షం 'మరసం', ఎన్నో నిశ్శబ్దపు గొంతులకు ఊపిరిలూదిన వేదిక 'మరసం', ఎన్నో ప్రజా ఉద్యమాలకు పాదరసం లాంటి అక్షరమై నిలిచింది 'మరసం',
సామాన్యుడి కన్నీళ్లకు, కష్టాలకు, జీవితాలకు స్వచ్ఛమైన అద్దమైంది 'మరసం'.
మంజీరా రచయితల సంఘం (మరసం) మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా అడుగులేసింది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో అధికారిక ఖాతాలను ప్రారంభించి సాహిత్యాభిమానులకు మరింత చేరువైంది. కవుల రచనలు, పుస్తక ఆవిష్కరణలు, సంస్థాగత కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ఈ ఆన్‌లైన్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులకు చేరువచేస్తూ, సరికొత్త తరంతో తన అక్షర ప్రయాణాన్ని మమేకం చేస్తోంది.
మంజీరా రచయితల సంఘం అంటే...
ఒక సంస్థ, అది నలభై ఏళ్ల నిరంతర అక్షర ప్రస్థానం. కొందరు వ్యక్తుల సమూహం. అది నలభై ఏళ్ల ఎడతెగని ప్రజా సాహిత్య ప్రయాణం. పుస్తకాల వాశి కాదు, అది నలభై ఏళ్ల సామాజిక చైతన్యానికి సజీవ సాక్ష్యం.
గత నలభై ఏళ్లుగా ఈ అక్షర జ్యోతిని ఆరిపోకుండా కాపాడుతూ, తమ స్వేదంతో, మేధస్సుతో సంస్థను ఈ స్థాయికి చేర్చిన వ్యవస్థాపకులకు, అధ్యక్ష కార్యదర్శులకు, కవులకు, రచయితలకు, కళాకారులకు, అక్షరాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ 40వ వార్షికోత్సవం సందర్భంగా యావత్ సాహిత్య లోకం ఘనంగా నీరాజనాలు అర్పిస్తోంది. మానవతా భావుకతను, జీవితపు విలువలను మున్ముందు కూడా మరింత బలంగా సమాజానికి అందించాలని, మంజీరా ప్రవాహం ఎప్పటికీ ఇలాగే సాగిపోవాలని ఆకాంక్షిస్తూ...
- డా. సిద్దెంకి, 9441244773
- మంజీరా రచయితల సంఘం (మరసం)























.jpg)





