ఎడమ నుంచి కుడికి వరుసగా....
సిద్దెంకి యాదగిరి, అలాజ్ పూర్ శ్రీనివాస్, పప్పుల రాజిరెడ్డి, నందిని భగవాన్ రెడ్డి, కలకుంట్ల రంగాచారి, మచ్చ రాజశేఖర్ రెడ్డి గారలు ...
26.9.24, 11 p.m.
'జోట పాటలు ' కవితా సంకలనం పై చిరు సమీక్ష.
-పప్పుల రాజిరెడ్డి
మంజీరా రచయితల సంఘం 33వ వార్షిక సభల సందర్భంగా వెలువడిన సంకలనం జోట పాటలు.
కవులందరికీ ఈ సందర్భంగా అభినందనలు.
ఇందులోని కవులందరూ లబ్దప్రతిష్టులే. కవుల గురించిమాట్లడకుండా వారి కవితా వస్తువు పై కొంత మాట్లాడే ప్రయత్నమిది.
నందిని సిధారెడ్డి గారి ' ఇంగితం ' అనే కవితతో ఈ సంకలనం మొదలౌతుంది.
గొంగలిపురుగు పత్రహరితం గురించి పలవరించడం విచిత్రంగా ఉంటుంది. రైతుకు ఎవరూ ఇంగితం నేర్పాల్సిన అవసరం లేదు.
కన్నీళ్లు దాటి వచ్చాడు. కాలాలు కడచి వచ్చాడు.
కలగనకుండా ఉండలేడు .
ఏ కార్తే పనిలేకుండా ఉండలేడు.
బతుకు కోసం పుండు పుండయితడు.
రైతు అనుభవాన్ని, ఔన్నత్యాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్తారు.
పుండు పుండు అయితడు అనే వాక్యం తో రైతుని మన కంటి నీటి పొరలో దర్శింపజేస్తారు
సిధారెడ్డి గారు.
కాలాలు, కార్తెలు పంటల గురించి రైతుకున్న ఇంగిత జ్ఞానం ఒకరు చెప్పాలా. కూచుని వంకలు పెట్టే చంంద్ర వంకకు ఆ అర్హత అసలే ఉండదు కదా!
దేశపతి శ్రీనివాస్ గారి 'మట్టిపూల గంధం '
అనే కవిత మట్టినుంచి మనిషిని వేరుచేసే కుట్ర పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. మట్టినుంచి 'మనుషులుగా మొలిచినవాళ్ళం మనం ' అంటూ,
'ఒకే పూవు పూసే ఎడారిని పుట్టించడానికి మట్టినుంచి వేరుచేస్తారట నిన్ను ' , దోస్తీ లేని రాజ్యం కావాలి వాళ్ళకు అని హెచ్చరిస్తారు దేశపతిగారు.
దేశభక్తి, పేరిట మట్టిని వేరుచేయడం, మతం పేరిట దోస్తీ లేకుండా చేయడం లాంటి, ఒకే పూవు వెనక ఉన్న ఎజెండా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఈ కవిత.
సామ్రాజ్యవాదం పై, ప్రపంచీకరణ ఫలితంగా విచ్చిన్నమౌతున్న మానవ సంబంధాలపై ఒకప్పుడు విరివిగా కవితలు వచ్చాయి . ఇప్పటికీ వస్తున్నాయి.
అయితే ఇప్పుడు దేశభక్తి పేరుతో మనిషి నిజాయితీని శంకిస్తూ అస్తిత్వాన్ని సవాలు చేస్తూ మతవిద్వేషాలకు
ఒడిగడుతున్న శక్తులకు వ్యతిరేకంగా అనివార్యంగా కవిత్వం రాసే పరిస్థితి వచ్చింది.
మరసం జోటపాటలు సంకలనంలో అలాంటి కవితలు చాలానే కనిపిస్తాయి.
నిన్నటి దాక పులిని చూస్తే భయమేసేది. ఇప్పుడు ఆవుని చూస్తే భయమేస్తోంది అంటారు అలాజ్ పూరు కిషన్ గారు. కల్లోలం అనే తన కవిత మైనారిటీ వాదంతో రాసిన బలమైన కవిత.
నెలవంకమీది ప్రేమ అబద్ధం అంటారు వఝల శివకుమార్ గారు. కాకుల పహారాలో గాయపడుతూ కుంకుమపూలు , రాబందులకు ఎర్రతివాచీ పరచి భయాన్ని పొదిగే నిశ్శబ్దం. ఉనికిచుట్టూ ఓ ఉక్కపోత అంటారు శివకుమార్ గారు.
ఇక్కడ మనిషిగా పుట్టినందుకు మానవత్వం లేకున్నాసరే మతం అయితే కంపల్సరీ అంటారు చెన్నరాజు.
సహజంగా నాటుకున్న తీగ పరజీవిలా ఎలా పెరుగుతుంది? అన్న బెల్లంకొండ సతీష్ గారి మాటల్లో కూడా ఆ భావనే ధ్వనిస్తుంది. గాయమ్మీద అద్దని నెనరు నాలుక, నాలుక కాదంటారు సతీష్ గారు.
మతం మకిలిని మలిపేసే స్కీం ఏదన్నా పెట్టండి అంటారు సిద్దెంకి యాదగిరి గారు.
స్వచ్చభారత్ అంటూనే రాజ్యం , పర్యావరణాన్ని ధ్వంసం చేసే కుట్రకు వ్యతిరేకంగా, ముఖ్యంగా యురేనియం కోసం నల్లమల అడవుల విధ్వంసానికి సిద్ధమవుతున్న తరుణంలో, అందుకు నిరసనగా అనేక కవితల్ని ఈ సంకలనంలో చూడొచ్చు.
పప్పుల రాజిరెడ్డి గారు రాసిన' శాగ ' అనే కవితలో నల్లమల జీవన, వన సౌందర్యాన్ని వర్ణిస్తూ , 'నల్లమల నిర్మించడానికి మీ జీవితం సరిపోదు ' అంటారు. విచ్చేదనను ఆపటానికి తేనెటీగల సమూహమై నల్లమలని నిలుపుకుందాం అంటారు రాజిరెడ్డి గారు.
అడవి ఒక జంగ్ జమీన్. అది పేలకముందే నీ అధికారాన్ని ఆజ్ఞలో ఉంచుకో అని హెచ్చరిస్తారు పొన్నాల బాలయ్య గారు. అడవి ఆత్మ తెలియనోడివి ఆవు గురించి మాట్లాడతావ్ ! మట్టి తత్వం తెలియనిది మతం గురించి మాట్లాడతావ్! అంటూ ఎత్తిపొడుస్తారు.
యురేనియం కాదది అడివికి ఉరేనియం అంటూ కలాలను కత్తులుగా చేసి గళాలను తూటాలుగా పేల్చండి అంటారు గంభిరావుపేట యాదగిరి గారు.
నల్లమలను రక్షించడానికి నడువుమంటూ తన పాటలో, నల్లమల జీవన సౌందర్యాన్ని దాన్ని కాపాడాల్సిన బాధ్యతను ఎలుగెత్తి చెప్తారు
కల్వకోలు మద్దితేజ గారు.
పర్యావరణాన్ని కాపాడమని ప్రత్యేకంగా చెప్పుకునే రోజులు పోవాలని నరాల సుధాకర్ గారు ఆకాంక్షిస్తారు.
గుట్టలను పిండిచేసి భూమి గుండె చీల్చుతున్న మాయగాళ్ళ నుంచి ప్రకృతిని రక్షించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తారు కళ్లెం లక్ష్మణ్ గారు.
అలల తాకిడికి విచ్చిన్నమై బతుకులు ఆగమాగమై, బతుకునిచ్చిన మట్టికి దూరమైనపుడు, బతుకులను త్యాగాల కీర్తనలు చేరదీయకుంటే, ఇక పాడేది గాయాల గేయాలనే. అంటారు N.భగవాన్ రెడ్డి గారు.
ఇక కులవివక్ష, స్త్రీలపై అత్యాచారాలు, లింగ వివక్ష వంటి సామాజిక రుగ్మతల్ని మరసం కవులు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారు.
తమ కవితల్లో రాజ్యహింస, మానవ సంబంధాలకు విఘాతం వంటి అనేక సామాజిక కోణాల్ని కవులు ఆవిష్కరించారు.
తొవ్వదేం తప్పులేదు నడిచేవానిదే తప్పు.నరంలేని నాల్కదే దోషం. అంటూ వివక్షలమీద, అన్యాయం పై గొంతు విప్పాల్సిన అవసరాన్ని చెప్తారు
తైదల అంజయ్య గారు.
ఊరించి ఊరించి ఎన్ని భాషల్లో చెప్పినా దుఃఖం వ్యతిరేకార్థం లో ధ్వనించదు.అంటారు
కోట్ల వెంకటేశ్వరరెడ్డి గారు.
తెగిన గాయాలను కూర్చుకుని కొత్త గేయాలను ఆలపించాల్సిన అవసరాన్ని వివరిస్తారు
చమన్ గారు.
ఉడుకు రక్తమా! చిరునవ్వుల వెనక విషపు కోరల్ని ఊడవీకుమా అంటారు ఘనపురం దేవేందర్ గారు.
ఒక్కడు నలుగురవ్వాలి. వెలుతురు విత్తనాల్ని జల్లుకుంటూ వెళ్ళాలి. అంటారు
వారాల ఆనంద్ గారు.
ఆకలితో ప్రశ్నిస్తే కడుపునిండా జవాబు రాకపోతే, ఒక్క "ప్రశ్నగుద్దు' గుద్దితే"జవాబు రక్తం ' గక్కాలే . అంటారు చిలుముల శ్రీనివాస్ గారు.
కట్టె పుల్ల అని కలత చెందొద్దు. ముఖానికి పోరాట గంధకాన్ని దట్టిస్తే శత్రువును దహించవచ్చు. అంటారు తోట అశోక్ గారు.
అనునిత్యం మొలిచే మొక్కలు సూర్యునికి సుప్రభాతం తప్పక పలకగలవు. అంటూ విశ్వాసాన్ని ప్రకటిస్తారు ప్రముఖ సీనియర్ కవి
నాళేశ్వరం శంకరం గారు.
నిరసన అద్దం బద్దలైతే అది వెయ్యిన్నొక్క ముక్కల్లో వేల రూపాల్లో పుట్టుతూనే ఉంటదని అంటారు దాసరాజు రామారావు గారు. ఆ నిరసన చూపేది రైతులు, నిరుద్యోగులు లేదా నిస్సహాయులు ఎవరైనా కావొచ్చు.
చందమామను అద్దంలో చూపించి సంతృప్తి పరుస్తూ, ప్రశ్నిస్తే చీదరించుకోవడం పట్ల తన కవితలో
కే.అంజయ్య గారు నిరసన చూపారు. వృద్ధాప్యపు వెతలని ఆవిష్కరిస్తూ, చెదల పాలనలో చెత్త జీవనం అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణా ఆవిర్భావం తరవాత, తల్లి గోదారి తరలి వచ్చి రంగనాయక సాగరమై, ధరణి దప్పిక దీరి పచ్చని పైరులు పరిఢవిల్లిన వైనాన్ని K.రంగాచారి గారు తల్లి గోదారి అనే పాటలో ఆవిష్కరించారు. ఆ పాటలో పదాల నడక గోదారి పారినట్టుగానే ఉంటుంది.
జీలం నది వద్ద సాగిన సంభాషణ చీనాబ్ వద్ద ప్రేమ చెరిగిపోయి, ఇద్దరి ఎడబాటుతో స్వేచ్ఛ కూలిపోయిన వైనాన్ని వేముగంటి మురళి గారు కవితలో చూడొచ్చు.
కందుకూరి శ్రీరాములు గారు తనను కవిత్వపు బాట పట్టించి భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని చూపించి కవిత్వపు లోతులు ఎరుకపరచి జిజ్ఞాస పెంచిన వ్యక్తిని తన కవితలో దర్శించుకుంటారు.
ప్రాణం పోసిన తల్లిని అర్థం చేసుకోలేని కొడుకువల్ల ఆ తల్లి అనుభవించిన ఘోషను పత్తిపాక మోహన్ గారి అనువాద కవితలో చూడొచ్చు.
కాపురం కుంపటిలో సహజంగా ఉండే బాధలను కవిత్వీకరించారు అహోబిలం ప్రభాకర్ గారు.
ట్రాన్ఫర్ అయితే మనల్ని మనం ట్రాన్ఫామ్ చేసుకునే క్రమంలో పడే బాధల్ని చెప్పారు
B.J. నరసింహమూర్తి గారు.
వొడవని రంథి తో బతుకు ప్రయాణం సాగే తీరుని తన కవితలో చెప్పారు పిట్టల మధు గారు.
ఇక మంజీరా రచయితల సంఘం గొప్పదనాన్ని శ్లాఘిస్తూ, రెండు కవితలున్నాయి.
ముగ్గురు సాహితీ మిత్రుల అమరత్వాన్ని తలపోస్తూ, కళాకారులను, ఉద్యమకారులను సానపెట్టిన మరసం పై జంగ వీరయ్య గారు రాసిన కవిత, అలాగే
గల్లాపట్టి నిలదీసే తల్లి సాలు మంజీరా అంటూ వనపల్లు సుబ్బయ్య గారు రాసిన కవిత, ఈ సంస్థ ముప్పయి మూడేళ్ల ప్రస్థానానికి చిరు పరిచయాలుగా చెప్పవచ్చు.
నిజానికి ఈ సంకలనం లోని కవితలు ఎంతో జీవితానుభవం, సమాజంపట్ల అవగాహన, పట్టింపు ఉన్న, చేయి తిరిగిన కవులు రాసినవి. ప్రతీ కవితా ఎన్నో అంశాలను స్పృశిస్తూ రాసినదే. ఒక్కో కవిత గూర్చి ఎంతో సమయం వెచ్చించి మాట్లాడాల్సిన సందర్భం.
అయితే సమయాభావం వల్ల ఇందులోని కవితలని స్పర్శా మాత్రంగానే పరిచయం చేయడం జరిగింది.
మిత్రులు సంకలనాలు తీసుకుని చదివి, వీలైతే మీ ఇతర మిత్రులకు చేరే విధంగా చూడాలని మనవి.
Thank you.
No comments:
Post a Comment