06 January, 2026

రచనకు ఆయువు జీవితమే - నందిని సిధారెడ్డి

రచనకు ఆయువు జీవితమే

-నందిని సిధారెడ్డి

ఉద్రాక్ష పూలు పూసినంత సహజంగా మాటలు పూసే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. ఆరుగాలం కష్టం చేసినా సంసారం ఎల్లని వ్యవసాయ కుటుంబం మాది. ఎవరూ ఆసరా లేకపోయినా, కొట్లాడి, నిలబడి, జీవితం నిలబెట్టుకున్న బాపు, ఎత ఎవలదయినా విని, కరిగి, కన్నీరై ఒలికే అవ్వ, వెనుక దర్వాజ, ముందు దర్వాజ తెరిచి, గోసగోసగా వచ్చే మనుషుల హృదయం తెరచి కష్టసుఖాలు పంచుకుని ధైర్యం నూరిపోసే పురసంస్కృతుల చరిత్ర వంటి ఇల్లు, ఆడినన్ని ఆటలు, పాడినన్ని పాటలు, తిరిగినన్ని చెలకలు, తిన్నన్ని పండ్లు, కాయలు, తీరికలేనంత తీపిబాల్యం, ఒక్క పాండిత్యం తప్ప కవిగావటానికి ఏమేం కావాలో అవన్నీ పుష్కలంగా అల్లుకొని ఉన్న జీవ వాతావరణం నడిమి నుంచి నడిచివచ్చాను. పొద్దున లేస్తే ఏదో ఒక పాట వినిపించేది. ఎటు చూస్తే అటు ఎండినదో, పచ్చనిదో చెట్టు కనిపించేది. ఎగిరే పక్షి ఒక ప్రేరణ. పాకే పాము ఒక మెలకువ. ఒక చెరువు వందల బావులు, వేల చేన్లు, గొర్ల మందలు, పశువుల మందలు, కంచెలు, మంచెలు, రాత్రయితే భాగోతాలు, భజనలు, ఒగ్గుకథలు, శారద కథలు, కథలుకథలుగా కదిలే మనుషులు ఊరి జనం కష్టాలు చూసి రాజకీయ నాయకుణ్ణి కావాలనుకున్నాను గాని, కవినయ్యాను. తెలియక ఏదేదో కావాలనుకున్నాను. తెలిసి కలగన్నదికై కట్టింది కవిత్వమే.

జీవించడానికి ఉద్యోగం కావాలి గదా, ఎంఏ తెలుగు చేసి, పరిశోధన చేసి, డాక్టరేట్ పొంది డిగ్రీ కళాశాల ఉద్యోగం పొందాను. చేతనయినంత ఉత్సాహంతో పాఠాలు చెప్పాను. కవులుగానో, గాయకులుగానో, ఉద్యోగులుగానో, ఉద్యమకారులు గానో, నాయకులుగానో, ఎదిగిన విద్యార్థుల్ని చూసి ఆనందించాను. ఉపన్యాసాలు చేయడం ఇష్టం. ఉద్యోగ విరమణ తర్వాత సైతం ఉపన్యాసాలు ఇష్టం. హృదయాన్ని కల్లోల పరిచిన జీవితాన్ని హృదయాలను తాకే సాహిత్యంగా మలచటం ఇష్టం. మరో పనిలేదు. రచనే పని. రచనే జీవితం.

తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు రచనకు దారి దొరికింది. తెలుగు వాచకం చదువుతుంటే పాఠాలు ఆకర్షించాయా, పద్యాలు ఆకర్షించాయా, పాటలు, కథలు ఆకర్షించాయా.. ఏవేవి ఎప్పుడెప్పుడు వెంటాడుతున్నాయో గాని అష్టకాల నరసింహ రామశర్మ "శిథిల విపంచి పద్యాలు నన్ను దారి మళ్లించాయి. సరదాకు రాజకీయాలు, సంపాదనకు రాజకీయాలు గాని సాహిత్య ప్రపంచమే సరైన దారిగా నా తత్వానికి నప్పిన దారిగా తోచింది. పద్యాలు పట్టుకున్న తర్వాత కొమురవెళ్లి మల్లికార్జునస్వామి మీద శతకం రాశాను. ఊరిమీదా, రైతు మీదా పద్యాలు రాశాను. సిద్దిపేట కళాశాలలో చేరిన తరువాత సినిమాల పిచ్చి, సినిమా పాటల పిచ్చి, సినారె ఆకర్షించాడు. మహమూద్ పాషా, భగవంతరెడ్డి, శాఖా గ్రంథాలయం, కళాశాల నవ సాహితి, కవి సమ్మేళనాలు కొత్త ప్రపంచం. కవిత్వ ప్రపంచం. లెక్క తప్పి లెక్కల నుంచి కవిత్వంలో మునిగితేలాను. "బిచ్చగాడు" అచ్చయిన మొదటి కవిత, మహమూద్ పాషా, సిద్ధారెడ్డి జంట రచన. స్థానిక "మాతృభూమి" పత్రికలో వచ్చింది. తర్వాత విప్లవ కవిత్వం వైపు చూపు. మినీ కవిత్వం అప్పటి ట్రెండ్. సాహసం చేసి కందుకూరి శ్రీరాములు, కర్ణాల బాలరాజు, సిద్ధారెడ్డి త్రిమూర్తుల "దివిటి" ప్రచురించాం. మినీ కవితా ధోరణిలో తెలుగులో మొదట వెలువడిన సంకలనం. "దివిటీ"యే. నా సాహిత్య ప్రయాణాన్ని మలుపు తిప్పిన సంవత్సరం 1974, సరిపల్లి కృష్ణారెడ్డి విప్లవ రాజకీయాలు పరిచయం చేశాడు. సూరపనేని జనార్ధనను పరిచయం చేశాడు. ఒకవైపు విప్లవ చలనాలు, మరొక వైపు సాహిత్య చలనాలు.

'భూమిస్వప్నం' నా మొదటి కవితా సంపుటి 1987 లో వచ్చింది. అది మొదలు.. సంభాషణ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టువడి, ఇక్కడి చెట్లగాలి, నీటి మనసు ఏడు కవితా సంపుటాలు ప్రచురించాను. 'అనిమేష' కావ్యం రచించాను. 'నాగేటి సాల్లల్ల' పాటల సంపుటి వెలువడింది. 'ఇగురం' ఆవర్తనం విమర్శ వ్యాసాలు "తెలుగు కవిత్వంలో సూర్యుడు" వాస్తవికత, అధివాస్తకవిత, పరిశోధనా గ్రంథాలు, 'చిత్రకన్ను' 'బందారం కథలు' కథా సంపుటాలు.

ఇటీవల మా బాపు జీవిత కథ నేపథ్యంలో రాసిన నవల 'నాగటి తరం' చరిత్ర, సమాజం ఎట్లా గుర్తించినా సృజనకారుడికి అన్ని సాహిత్య ప్రక్రియలు సమానమే అని నా భావన. పద్యాలతో మొదలయ్యాను. వచన కవిత్వంలో స్థిరపడ్డాను. సందర్భం ఒత్తిడి చేస్తే పాటలు రాశాను. 'నాగేటి సాల్లల్ల' పాటకు చాలా గుర్తింపు వచ్చింది. "వీర తెలంగాణ” సినిమాలో జేసుదాసు పాడాడు. ఆ పాటకు 2010 ఉత్తమ సినీ గీతంగా "నంది" పురస్కారం వచ్చింది. కథలు, నవలతో పాటు నాటకం కూడా రాశాను. అనుకోకుండా నాలుగు నృత్య రూపకాలు రాశాను. ఇందిరాపరాశరం, కూచిపూడి నృత్య కళా దర్శకత్వంలో "తెలంగాణ", "అన్నదాత", దాశరథి నృత్య రూపకాలకు బాగా పేరొచ్చింది.

ఏ రచయితా పురస్కారాల కోసం రాయకపోవచ్చు. కానీ, కోరుకోవచ్చు. సృజనకు అదొక కొలమానం కావొచ్చు.

"భూమిస్వప్నం" ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, దాశరథి అవార్డు అందుకున్నది. "ఒక బాధ గాదు” విశ్వ కళాపీఠం పురస్కారం అందుకున్నది. "ప్రాణహిత"కు తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభా పురస్కారం ప్రకటించదలచుకున్నప్పుడు రైతు ఆత్మహత్యల నేపథ్యంలో తిరస్కరించాను. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించదలిస్తే "తెలంగాణ తల్లి" చేతి బతుకమ్మ తొలగించిన నేపథ్యంలో తిరస్కరించాను. నచ్చిన సందర్భాల్లో కొన్ని స్వీకరించాను. తెలుగు విశ్వ విద్యాలయ విశిష్ట పురస్కారం, తేజా ఆర్ట్స్ పురస్కారం, సదాశివుడి పురస్కారం, సినారె జీవన సాఫల్య పురస్కారం, పల్లా దుర్గయ్య పురస్కారం, బి.ఎన్.సాహిత్య పురస్కారం మరికొన్ని పురస్కారాలు ఆత్మీయంగా స్వీకరించాను.

రచయిత పురస్కారాలు దాటి హృదయాల్లోకి చేరుకోవాలని భావిస్తాను. రచనను సామాజిక బాధ్యతగా భావిస్తాను. ప్రజలిచ్చే గుర్తింపే అన్నింటికంటే పెద్దది. ఏ రచయితనైనా నిలబెట్టేది ప్రజలే. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత శిల్ప చాతుర్యం ప్రదర్శించినా, ఎన్నెన్ని భాషల అనువాదాలు సంతరించినా రచనకు ప్రమాణం సమాజమే. రచనకు సాఫల్యత హృదయ స్పందనే. జీవితం రాయటం ద్వారానే జీవితానికి చేరువవుతాం. తమ సాహిత్యానికి ఖ్యాతి రాలేదని, సముచిత గుర్తింపు రాలేదని ఉక్రోషపడే రచయితల్ని చూస్తుంటాం. ఉక్రోషం ద్వారా గుర్తింపు రాదు. ఉత్తమ రచనతోనే గుర్తింపు వస్తుంది. ఉత్తమ రచనకు నిజాయితీ ముఖ్యం. హృదయం ముఖ్యం. ఉత్తమ రచన ఎప్పుడైనా, ఏ భాషలోనైనా జీవితం నుంచే రూపొందుతుంది. పుస్తకాలు శిల్ప నైపుణ్యానికి, రచనా నైణ్యానికి ఉపయోగపడవచ్చు.

No comments:

Post a Comment