Showing posts with label మరసం. Show all posts
Showing posts with label మరసం. Show all posts

20 January, 2026

మంజీర కవి పప్పుల రాజిరెడ్డి గారికి కాళోజి పురస్కారం


తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ వారు అందించే ప్రతిష్టాత్మక పురస్కారం 
ప్రజా కవి కాళోజి పురస్కారాన్ని 2025 కు గాను మంజీరా రచయితల సంఘం  ప్రముఖ కవి పప్పుల రాజి రెడ్డి గారికి అందించడం పట్ల మంజీరా రచయితల సంఘ సభ్యులందరూ అభినందన వ్యక్తం చేశారు. 

జయహో పప్పుల రాజిరెడ్డి గారు 
జయహో పప్పుల రాజిరెడ్డి కవిత్వం 





*అక్షరాలతో నిప్పులు కురిపించిన పప్పుల రాజిరెడ్డి*
   - ఎ. గజేందర్ రెడ్డి

తెలంగాణ జీవితమంతటినీ నిలువెత్తుగా నింపుకున్న, తెలంగాణ తెలంగాణ భాషను శ్వాసగా నిలుపు కున్న, వ్యవస్థపై ధిక్కార స్వరాన్ని వినిపించిన కాళోజీ నారాయణరావు పేరిట ఇచ్చే అవార్డును కొత్త అనిల్ నేతృత్వంలోని తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ తేది. 25.12.2025న పప్పుల రాజిరెడ్డికిచ్చి గౌరవించింది. కాళోజీ అవార్డుకు అర్హత పొందిన పప్పుల రాజిరెడ్డి కవిత్వంలోని గొప్పతనమే మిటో పరిశీలిద్దాం.

"సంకెళ్లను ఛేదించే ప్రతిఘటనా పిడికిళ్ల నినాదం మా కవిత్వం 
తెలంగాణ పల్లెల కల్లోల హృదయం మా కవిత్వం
అడవులు మా కవిత్వం 
ఆయుధాలు మా కవిత్వం 
ప్రజలు మా కవిత్వం
ప్రజావీరులు మా కవిత్వం." ఇదీ రాజిరెడ్డి కవిత్వ వరుస. 

"నా అక్ష రాల గొంతును నులిమేసినా
నా పాటల చరణాల్ని తెగ్గొట్టినా
నా పిడికిళ్ల కాంతిని నియంత్రించినా
నా పదచిత్రాల కళ్లు పెరికేసినా 
వాటిని పునర్నిర్మిస్తుం టాను". ఇదీ ఆయన ఆత్మవిశ్వాసం. 

తలలో నాలుకైన పాట 
గ్రామాల మీంచి గూడేల మీంచి
పొలాల మీంచి
కలాల మీంచి
మట్టి మీంచి పారుతుంది
పాట చావదు
నాగేటి చాలై నవ్వుతుంది. ఇదీ ఆయన ధీమా.

 "మట్టి గర్భంలోంచి మంకెన పూమొక్కలా దూసుకొస్తాను 
వ్యవస్థ గుండెలదిరేలా కల్లోల కెరటమవుతాను 
సాగర సంగీత మేళంలో రేలపాట పాడుతాను". ఇదీ ఆయన తీరు. 

ఇతడు ఉప్పెనై ఉరుమై మేఘమై మెరుపై అడివై ఆయుధమై ఏరై తల్లి వేరై నరసరాన ప్రవహించే రుధిరమై ఆ ప్రవాహంలో తేలిపోతాడు. ఇతని కవిత్వంలో ఖడ్గ హృదయంతో కరచాలనం చేస్తుంది. పక్షులు కువకువలతో స్వరచాలనం చేస్తాయి. చెమట నదుల హృదయాలు జీవనో త్సాహంతో ఉరకలెత్తుతాయి.

పాలు కారాల్సిన బుగ్గలు గొర్లు కాస్తూ బతుకు గొంగడి బుజానేసుకొని చెట్టూ పుట్టతో చెలిమి చేస్తుంటే, బలపాలు పట్టాల్సిన చేతులు బరిగె పట్టి పశువులను కాస్తుంటే తల్లడిల్లుతాడు. 
"మీ లేలేత శరీరాల కాయ కష్టాన్ని నిస్సిగ్గుగా దోచేస్తూ 
మీ కలల తలకాయల్ని తప్పదీస్తున్న ఈ పాపిష్టిలోకం క్షమార్హం కాదు" అని ఆగ్రహిస్తాడు.
పద్నాలుగేళ్లయినా నిండని పనిమని షి ఇరవై గజాల బావిలోంచి కష్టాన్ని తోడి బకెట్లలో నింపుతుంటే, అంట్లగిన్నెల సంగీతంతో బతుకు పాట నేరుస్తుంటే చూడలేక, ఆమె ఆలోచన ఎదగాలని, జీవన మూల్యాల మొగ్గ విచ్చుకోవాలని కోరుకుంటా డు. 

అణచి వేయబడుతున్న స్త్రీలనుద్దేశించి "కష్టాల ముళ్ల కిరీటాన్ని ఇంకెంతకాలం భరిస్తావు? 
అడ్డుగో డల్ని బద్దలు చేయి
స్వేచ్ఛా గాలుల జయకేతనం
ఎగురవేయి" అని సాహసాన్ని నూరిపోస్తాడు. ఇల్లు గుల్ల చేస్తున్న, కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మద్యం మహమ్మారి గురించి రాస్తూ 
"మత్తు స్పర్శ లేని జగత్తు కోసం మనమంతా ఒకటవుదాం 
 బీడువడ్డ జీవితాల్లో వసంతాన్ని మొలిపిద్దాం" అని ఉద్బోధి స్తాడు.

 "అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు ఏపాటివాడో చూడు" అన్నాడు కాళోజీ. అదే బాటలో “ఓటు వేసే ముందు నిజా నిజాలు తెల్సుకొని ఓ నిర్ణయానికి రావాల్సింది మనమే 
ఈ రాజ్యం మనది హక్కులు మనవి నిర్ణయాధికారం కూడా మనదే" అని ఎరుక పరుస్తాడు రాజిరెడ్డి. మగవాళ్లను గుడ్డిగా నమ్మి, ప్రేమ పేరుతో మోసపోయే ఆడవాళ్ల నుద్దేశించి 
"కత్తి లేకుండా, 
రక్తం అంటకుండా 
హంతకుడు విసిరిన యమపాశం ప్రేమ 
గాలానికి ఎర అయ్యావా 
వాని కామాగ్నికి సమిధవౌతావు" అని హెచ్చరిస్తాడు.

1980-90 దశకంలో కలం పట్టిన కవులు కొందరు అడవిబాట పట్టిన మనుషుల గురించి రాశారు. రాసిన వాళ్లలో రాజిరెడ్డి ఒకడు. ఈయన అందులోని సాధక బాధకాలనూ రాశాడు. "అడవిబాట పట్టిన వాడేమంటాడు? చెట్లల్ల కెందుకురా అంటే చెట్లే నిజాయితీ మెట్లంటాడు.
 అడివైనా వెందుకురా అంటే అడివే నా అమ్మంటాడు అడివంత పచ్చగా స్వేచ్ఛగా బతకటమే బతుకంటాడు" నిజమే కావచ్చు. కానీ వాళ్ల ఆశయం నెరవేరుతున్నదా? సమాజంలో అవినీతి అక్రమాలు అరాచకాలు తగ్గాయా? అలా కానప్పుడు నిరర్ధక త్యాగాలెందుకు? కొందరిని చంపడమెందుకు? చావడమెందుకు? వాళ్లను కన్నవాళ్ల కడుపు కోత ఎవరు తీరుస్తారు? 
"కొడుకా! మా ముద్దుల బంగారు కొండా! 
నువ్వు లేవని ఏడ్వాలా? 
బతుకీదలేక చావాలా? 
చేతకాని ఈ ముసలి పీనుగలను ఉద్దరిస్తావనుకున్నాం. 
కలో గంజో తెచ్చి కంచానశ పెడతావనుకున్నాం.
మా కళ్లముందు పిల్లాపాపల్తో సుఖంగా ఉంటావనుకున్నాం.
మా బతుకెట్ల గడవా లిరా! 
మాకు పొద్దెట్ల పోవాలిరా? 
నువ్వే చెప్పాలిరా" అని ఏడ్చేవాళ్లను ఎవరు ఓదారుస్తారు? 'వరదగూడు' కవితా సంపుటంలో ఆవేశంలో అక్షరాలతో నిప్పులు కురిపించిన పప్పుల రాజిరెడ్డి ఆనవాలు, గంగాళం కవితా సంపుటులలో ఆలోచనకు ప్రాధాన్యమిచ్చాడు. పాఠకులనూ ఆలోచనలో పడేశాడు. వర్తమాన పరిస్థితిని పరిశీలించాడు. మనుషుల తీరుతెన్నుల్ని గమనించాడు.

మనం మనుషులమేనా? మనుషులుగా మనగల్గుతు న్నామా? మనమెటు పోతున్నాం? మన తరమేమవుతుంది! మన గోతిని మనమెలా తోడుకుంటున్నాం? రక్తం తాగనేర్చిన మనుషుల్ని చూస్తున్నాం. మనిషితనం లేని డొల్ల మనుషుల సమూహం హింసే పరమావధిగా ప్రవర్ధమానమవుతున్నది. మనిషికీ మనిషికీ మధ్య వస్తు సంబంధమే రాజ్యమేలుతున్నది. కన్నతల్లి వంటి చెరువు, కల్పవృక్షం వంటి ఊరు, పాడి బర్రె వంటి వాగు ధ్వంసమవుతున్నయ్. రియల్ ఎస్టేట్ పేరిట 
"శిఖం మాయం 
 గుట్ట మాయం
 కుంట మాయం 
 తేడా వస్తే మనిషి
 మాయం".

మరి మనమేం చేయాలి? ఎవరికి తోచిన రంగాలలో మనిషి ఉద్ధరణకు, మానవతా వికాసానికి పాటు పడాలి. అందుకే పప్పుల రాజిరెడ్డి కవిత్వం రాస్తాడు. ఎవరి పేరిట రాజిరెడ్డి పురస్కారం అందుకున్నాడో, ఆ కాళోజీ గురించీ కవిత రాశాడు. అంతే కాదు. పల్లె పాటకు ప్రాణ పరిమళమద్దిన, పాటకు పాలు తాపి ఉగ్గు వెట్టి శిక్షణనిచ్చి జనబాణీలో వినిపించిన గూడ అంజయ్యను కొనియాడినాడు.

ఇంత బాగా వచన కవితలు రాసిన రాజిరెడ్డి భక్తి, దేశ భక్తి, సామాజికత నిండిన పద్యాలూ రాసినాడు. అదే 'పద్య నీరాజనం' అయింది.

మొత్తం మీద రాజిరెడ్డి కవిత్వాన్ని చదివితే, ఆయన ఏంచెప్పదలచుకున్నాడు?

"స్పందన స్పర్శా లేని మనిషి వొక మనిషేనా? 
తడీ తపనా లేని హృదయం నౌక హృదయమేనా? ప్రేమా. 
జాలీ లేని బతుకు ఒక బతుకేనా? 
ఒక మంచిమాట కోసం, 
ఒక ఆప్యాయతా పిలుపుకోసం, 
ఓ చల్లని స్పర్శ కోసం, 
ఓ చల్లనికరచాలనం కోసం బతుకుదాం". ఇదీ ఆయన కవితల సారాంశం.

 ఇంతమంచి ఆశయం కోసం కవిత్వం రాసిన రాజిరెడ్డికి అభినందనలు.

-ఎ. గజేందర్ రెడ్డి 
9848894086

20 July, 2025

మంజీరా రచయితల సంఘం 20-07- 2025 Rare photos




“మంజీర రచయితల సంఘం”ను 1986 జూలై 20న సిద్దిపేట కేంద్రంగా స్థాపించారు. డా. నందిని సిధారెడ్డి అధ్యక్షులుగా, కె. అంజయ్య కార్యదర్శిగా ప్రారంభించారు . ఈ సంఘం ఆదునిక సాహిత్య భావాలను ప్రజాస్వామిక, సామాజిక పరిణామాల నేపథ్యంతో అనుసంధానించే లక్ష్యంతో ఏర్పడింది.


– ప్రాచీన సాహిత్యపరంపరలకు ఆధునిక సాంఘిక-వ్యక్తిత్వ దృక్పథాన్ని కల్పించి, సాహిత్యాన్ని ప్రజల మద్య చేరువ చేయడం
– యువ రచయిత, కవుల వేదికగా నిలవడం, కొత్త భావోద్వేగాలను ప్రేరేపించడం
– మద్యపానం, గుట్కా–పాన్ మసాలా వంటి సామాజిక విషమాలకు వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలు నిర్వ‌హించటం .


సామాజిక ఉద్యమాలలో....

మద్యపాన నివారణ కోసం గ్రామీణ స్థాయిలో నాటకాలు, చైతన్య ప్రదర్శనలు

గుట్కా, పాన్ మసాలా వ్యతిరేక ప్రశ్నార్థక కవిత, పాటల ప్రచారం

రైతుల ఆత్మహత్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు

స్వరాష్ట్ర ఉద్యమ సందర్భంలో “నాగేటి సాలల్లు” వంటి ఉద్యమ గీతాలతో ప్రేరణ


 ప్రచురణలు, పుస్తకాల్లో విస్తృతి

40కి పైగా పుస్తకాలు ప్రచురించగా, వాటిలో  సాంఘిక భావజాలం ప్రాధాన్యం:

“మొగులైంది” – ప్రపంచీకరణ నిరసన కవితా సంకలనం

“ఎడుపాయలు” – తెలంగాణ కవితాల సంపుటి

“తెలంగాణ” – పోరాట గీతాల సంకలనం

“మెతుకు కథలు” – వరుస కథకుల కథల సంకలనం

చరిత్ర, విశ్లేషణాత్మక పుస్తకాలు: “ప్రజల మనిషి వట్టికోట”, “భైరాన్‌పల్లి పోరాట చరిత్ర”

అలాగే, వారి ఆడియో క్యాసెట్లు, వీడియోలు (“కవిదృశ్యం”, “నాగేటి సాల్లల్ల”) ద్వారా భాషాభిమానులందరికీ చేరువ అయ్యారు.

జోటపాటలు - కవిత్వం


 వార్షికోత్సవాలు & సాహిత్య సభలు

– 32వ, 38వ వార్షికోత్సవాలు జన చైతన్యంగా ప్రత్యేకంగా, ప్రముఖ కవులు-వక్తలతో ఏర్పాటయ్యాయి .
– 2021లో సిద్ధిపేటలో గజ్వేల్‌లో జరిగిన సాహిత్య సభలో ప్రముఖులు, రచయితలు సంకల్ప విధానాలు పంచుకున్నారు.


డిజిటల్ – సోషల్ మీడియా ప్రాజెక్టులు

సాంప్రదాయ మాధ్యమాలతో పాటుగా, మరసం యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ మొదలైన వాటిలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది . దీని వలన గ్రామీణ-నగర ప్రాంతాల మధ్య సాహిత్య యాజ్ఞాల అంతరాన్ని తగ్గించింది.

1. ప్రజాస్వామిక-సామాజిక చైతన్యం

 “మరసం” పాఠకుడిలో చైతన్య మేధస్సును నింపే లక్ష్యంతో పనిచేసింది.

2. స్థాయి పెంపుదల

యువ రచయితలకు వేదిక, గ్రామస్తులకు చైతన్యము, ఉద్యమ గీతాలతో సాహిత్య–ఆక్టివిజం సంబంధాన్ని మరింత బలపర్చండి.

3. బహుళ మాధ్యమ వాడకం

పుస్తకాలు, వాయిస్, వీడియోలతో మల్టిమీడియాగా మళ్లీ డిజిటల్ ప్రపంచంలో యువతను చేరుకునే ప్రయత్నం.

చరిత్ర, వ్యవహార రచనల ద్వారా ప్రజల ఆవేదనలను వ్యక్తీకరించడంతో, “మరసం” సాహిత్యాన్ని స్థూలంగా నిర్వచించింది: అది ఉద్యమ శక్తి కూడా అవుతుంది.


కొత్త కథా/కవితా/వ్యాస సంకలనాలతో సామాజిక భావాలను పరిరక్షించే
కథా, కవిత్వ కార్యశాలలు ఏర్పాటు చేసి యువ రచయితలకు శిక్షణ ఇచ్చే
భాషా పరిరక్షణలో వ్యవస్థ నిర్మాణం

ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ… Telugu భాషాభివృద్ధికి చేయూతనిస్తూ కొనసాగాలని సంకల్పించుకుంది .

మెదక్‌లోని “మరసం” వ్యూహాత్మకంగా సాహిత్యాన్ని సాంఘిక మార్పు సౌకర్యంగా మార్చి,  ప్రజాజీవనంలో శిల్పముగా నిలిచింది. ఇది తెలంగాణ ఉద్యమం, ప్రపంచీకరణ – అంతర్జాతీయ దృష్టులతో కూడిన, ప్రజాస్వామ్య-సామాజిక సాహిత్య వేదికగా పనిచేసింది.

భవిష్యత్తులో కూడా మరసం సమకాలీన సవాళ్లను అర్ధం చేసుకొని, యువతకు సృజనాత్మక శిక్షణ, ప్రజా చైతన్యం సాధన వేదికగా కొనసాగుతుంది.

#మంజీరా

12 May, 2025

మంజీరా రచయితల సంఘం - 40 ఏళ్ల సాహిత్య ఒరవడి

*మంజీర రచయితల సంఘం*


*1. మంజీర రచయితల సంఘం ఏర్పడి దాదాపు 40 ఏళ్లు కావస్తోంది. సంఘం ఏర్పడిన నేపథ్యం గురించి, దాని ఆలోచనలు, అవగాహన గురించి చెప్తారా?*
జ. 1986 నాటికి ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు జిల్లాస్థాయి రచయితల సంఘాలు ఉండేవి. ఒకటి. మెదక్ జిల్లా రచయితల సంఘం. రెండోది. మెదక్ మండల సాహిత్య పరిషత్. రెండు సంస్థలు సంప్రదాయ సాహిత్య కేంద్రంగానే నడిచేవి. పద్య రచన, అవధానాలు, పండిత చర్చలు ప్రధానంగా సాగేవి. ఆధునిక సాహిత్యానికి జిల్లాలో వేదిక లేదు. ఎనుభై దశకములో ప్రజా చైతన్యం విస్తరిస్తున్నా ఉద్యమాలు ఎగసిపడుతున్న జిల్లా స్థాయి సాహిత్య సంస్థలు లేకపోవడం వెలితిగానే తోచింది. ఆధునిక సాహిత్య భావోద్వేగాలు ప్రజా సమూహాలకు చేరువ చేయవలసిన కొత్త సందర్భమే "మంజీరా రచయితల సంఘం" ఏర్పాటు. జిల్లాలో చెల్లాచెదురుగా ఉన్న రచయితల్ని ఏకత్రితం చేయడం, ఆధునిక సాహిత్యాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తేవడం మానవ సంబంధాల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు దోహదపడే సాహిత్యాన్ని సృజించడం ప్రధాన లక్ష్యాలుగా మంజీరా రచయితల సంఘం రూపుదిద్దుకున్నది. 1986 జూలై 20న సిద్దిపేటలో డా. సి. నారాయణరెడ్డి చేతులమీదుగా ప్రారంభించటం జరిగింది. "మానవత భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మా అలంకారాలు, సరికొత్త భావాల చైతన్య వేదిక" అని స్పష్టంగా ప్రకటించుకున్నాం. పాడుకున్నాం విశాల ప్రాతిపదికన పని చేయడం అలవాటు చేసుకున్నాం. కొత్త భావాలకే కాదు కొత్త రచయితల వేదికగా సాగుతున్నది.



*2. ఈ సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో మీరు దాటి వచ్చిన అనేక మైలురాళ్లు వుంటాయి. సాహిత్య రంగంలో మీ సంస్థ వేసిన ప్రత్యేక ముద్ర కూడా తప్పకుండా ఉంటుంది. ఆ విషయాల గురించి, అలాగే మీరు చేసిన కార్యక్రమాల గురించి చెప్తారా?*
జ. నలభైఏళ్ల ప్రయాణం. మంజీరా ఎన్నో మైలురాళ్లు దాటింది. నది పేరు పెట్టుకున్న ఒరవడి. మంజీరా నదికి ఏడుపాయలు. రచయితల సంఘానికి ఏడు శాఖలు‌. అదొక ఉత్తేజం. నది పోటెత్తినట్టే మరసానిదొక ఉద్యమం. జిల్లా స్థాయి సంస్థే అయినా తన ఆచరణతో రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చుకున్నది. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ రచయితల భావోద్వేగాలు పంచుకున్నది. యువ రచయితలకు, సాహిత్య సంస్థలకు, ప్రేరణగా నిలిచింది. సంపూర్ణ మధ్యనిషేధ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నది. యాభై గ్రామాల్లో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చి చైతన్యపరిచింది. 'గుట్కా' కు వ్యతిరేకంగా, అశ్లీల సంస్కృతికి వ్యతిరేకంగా, ఉన్మాదాలకు నిర్బంధాలకు వ్యతిరేకంగా, ప్రజారాశులని కూడగట్టింది మహిళా చైతన్యానికి, దళిత చైతన్యానికి చేయూత అయింది. ప్రపంచీకరణ వ్యతిరేక కవితలతో "మొగులయింది" తొలుతగా ప్రచురించింది. తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానించిన మొట్టమొదటి సాహిత్య సంస్థ మరసం తెలంగాణ పాటలతో, ప్రసంగాలతో ఉద్యమం నిర్మించింది. ముందుకొస్తున్న తెలంగాణ సందర్భాన్ని గుర్తించి మంజీరా రచయితల సంఘం పదిహేనేళ్ల ఉత్సవాలలో "తెలంగాణ రచయితల వేదిక"ను స్థాపించింది. కవుల్ని, రచయితల్ని, గాయకుల్ని, పత్రిక రచయితల్ని, వక్తల్ని, ఉద్యమ నేతల్ని తీర్చిదిద్దింది. విప్లవోద్యమం నుంచి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం దాకా నలభైయ్యేళ్ళ తెలంగాణ సామాజిక, సాంస్కృతిక పరిణామాల్లో మరసం పాత్ర ప్రత్యేకమైంది.
 

*3. మంజీరా రచయితల సంఘం పుస్తక ప్రచురణలు కూడా చేపట్టింది. ఎలాంటి పుస్తకాలు మీరు వేశారు?* 
జ. 40 కి పైగా పుస్తకాలు ప్రచురించింది. కవితా సంపుటాలు, సంకలనాలు, కథా సంపుటాలు, సంకలనాలు, వ్యాస సంకలనాలు, పాటల సంకలనాలు, చరిత్ర - సంస్కృతి, భిన్న ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు ప్రచురించింది. తెలుగులో ప్రపంచీకరణను నిరసిస్తూ మొదటి కవిత సంకలనం "మొగులైంది". తెలంగాణ కవితా సంకలనం "ఎడపాయలు". తెలంగాణ ఉద్యమంలో మొదటి పాటల సంపుటి "తెలంగాణ" ప్రచురించటం విశేషం. మెదక్ లో తొలితరం కథకుల నుంచి వర్తమాన తరం కథకుల దాకా సంకలనం చేసి యాభైరెండు కథలతో "మెతుకు కతలు" ప్రచురించింది. వట్టికోట ఆళ్వారు స్వామిని మరిచిన నేపథ్యంలో జీవితాన్ని, సాహిత్యాన్ని విశ్లేషిస్తూ "ప్రజల మనిషి వట్టికోట" పరిశోధనా వ్యాసాలు ప్రకటించింది. కిరాతకుల చేతిలో బలైన గాయని బెల్లి లలిత యాదిలో "పాటల యాది" సంకలనం, క్యాన్సర్ బారినపడి దూరమైన కవి పోగుల రాజన్న యాదిలో "సెలవింక" సంకలనం వెలువరించింది. 'భైరాన్ పల్లి పోరాట చరిత్ర', 'తెలంగాణలో శాతవాహనులు' వంటి చరిత్ర పుస్తకాలు. 'ఆధునిక వ్యవసాయానికి ఆవలి వైపు' వంటి సామాజిక విశ్లేషణలు ప్రచురించింది. ఇవేగాక మారుతున్న మాధ్యమాల్ని స్వీకరించింది. కె. శివారెడ్డి కంఠస్వరంతో "శివారెడ్డి కవిత" ప్రముఖ కవుల కంఠ స్వరాలతో "జలపాతాలు" దేశపతి శ్రీనివాస్ గానంతో "నాగేటి చాల్లల్ల" ఆడియో క్యాసెట్లు వివిధ ప్రముఖ కవుల దృశ్శీకరణతో "కవిదృశ్యం" వీడియో రూపొందించాం. ఒకటే దేశం ఒకటే భాష. ఒకటే సంస్క్రుతి అని ఏక ధ్రువ సమాజం వైపు నడిపించే నినాదాన్ని వ్యతిరేకిస్తూ మంజీర కవులు వేసిన నిరసన కవిత గానం "జోటపాటలు". మైత్రి సమావేశాలు, ప్రముఖ కవులతో ఒక రొజు, కవి సాయంత్రాలు మొదలైనవి నిర్వహించింది.


*4. మీరు ఈ సంస్థను ప్రారంభించిన కాలానికీ నేటి పరిస్థితులకు మధ్య చాలా తేడా ఉంది. అనేక రకాల ప్రసార మాధ్యమాలు పాఠకుడికి - రచయితకి మధ్యనున్న దూరాన్ని చెరిపేస్తున్నాయి. స్థానిక సాహిత్యం నుండి అంతర్జాతీయ సాహిత్యం దాకా ఇవాళ్ళ అందుబాటులోకి వచ్చింది అందరికీ. ఇలాంటి స్థితిలో ఒక సాహిత్య సంస్థ అవసరం ఉందని అనుకుంటున్నారా ? భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు?*

జ. నిజమే, మరసం ప్రారంభించిన ఎనభయ్యో దశకానికీ, ఈ ఇరువయ్యో దశకానికీ చాలా మార్పులు సంభవించాయి. పరిస్థితులు పోల్చలేనంతగా మారిపోయాయి. మాధ్యమాలు, మనస్తత్వాలు, అభిరుచులు అన్ని విధాల మారినాయి పాఠకుడికి రచయితకూ, ప్రజలకూ నడుమ తీవ్రమైన అంతరం ఏర్పడింది. అయితే- మంజీరా రచయితల సంఘం యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఎక్స్, ఇంస్టాగ్రామ్, బ్లాగ్ స్పాట్ మొదలైన మాధ్యమాలలోను ప్రవేశించింది. ఈ అన్ని దశల్లో మంజీరా ప్రయాణిస్తూనే ఉన్నది గనుక- కలుపుకుంటూనే కలిసిపోతూనే ప్రవహిస్తున్నది. ప్రపంచం దగ్గరైంది. గ్రామం దూరమైంది. రెండింటి నడుమ మనుషులు తండ్లాడుతున్నారు. ఆరాటపడుతున్నారు. శ్రోత పాఠకుడయి, పాఠకుడు శ్రోతయి, కొత్తగా వీక్షకుడు అయి ఉండవచ్చు. అయినా- తడి ఆరలేదు. తపన తీరలేదు. రచయితల పని, సంస్థల పని మరింత పెరిగింది. వ్యవస్థతో పోరాట దశ అప్పుడు. వ్యక్తిగత పోరాట దశ ఇప్పుడు. మనిషి ఇంకా శిథిలమైపోయాడు. రాజకీయాలు శిథిలమైపోయాయి. రచయితలు, కవులే ప్రాణం తట్టాలి. మనిషిని ప్రతిష్టించాలి. ఆ ప్రయత్నంలో మరసం ఆపసోపాలు పడుతున్నది. ప్రాణం రేకెత్తించడానికి ప్రయాణం ఉన్న సంస్థలైనా ఏర్పడుతున్న సంస్థలైనా కొంచెం కొంచెంగానైనా కదలాలి! కదిలించాలి! విశాల ప్రాతిపదిక, విశ్వాసంతో నడక మంజీరా రచయితల సంఘం నమ్ముకున్నది. నడుస్తున్నది. 

*చివరిప్రశ్న. భవిష్యత్తులో మంజీరా రచయితల సంఘం నుండి ఏ ఏ కార్యక్రమాలు చేయాలని సంకల్పించుకున్నారు?*

ఒక కథా సంకలనం, కవితా సంకలనం, వ్యాస సంకలనం వెలువరించాలని మరసం సంకల్పించుకున్నది. ఇంకా కథా కార్యశాల, కవిత్వ కార్యాశాల నిర్వహిస్తూ కొత్త కథకులకు, కవులకు ఆలంబనగా నిలవాలని ఆశిస్తున్నది. ప్రజా ఉద్యమాల్లో మమేకమవుతూ సాగాలని నిశ్చయించుకున్నది. తెలుగు పై జరుగుతున్నఅనేక రకాల వివక్షల్నీ ఎప్పటికప్పుడు నిరసిస్తూ తెలుగు భాషా సాహిత్యాల వికాసం కొసం విస్త్రుత ప్రాతిపదికన క్రుషి చేయాలనీ భావిస్థున్నది. 

-విమల