కోటి రూపాయలు ముఖ్యం కాదు తెలంగాణ తల్లి ముఖ్యం
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
నందిని సిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ నమస్తే తెలంగాణలో
Nandini Sidda Reddy |
అందుకే పురస్కారాన్ని తిరస్కరించిన..
ప్రముఖకవి నందిని సిధారెడ్డి..!
కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి స్పష్ట
అట్లా చేస్తానంటే ఎవరూరుకుంటరు?
ఓవైపు హననం.. మరోవైపు ఉత్సవమా?: సిధారెడ్డి
కోటి రూపాయలు ముఖ్యం కాదు కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం
అందుకే పురస్కారాన్ని తిరస్కరించిన
తెలంగాణ తల్లిని మార్చడమంటే మన ప్రతీకలను అవమానించడమే
గ్రామీణ మహిళ చెయ్యి ఖాళీగా ఉండదు
చేతిలో పనిముట్టు తప్పక ఉంటుంది
అప్పులు అంటూనే దుబారా ఖర్చు
ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నరు
సమస్య కానిదాన్ని సమస్య చేస్తున్నరు
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రముఖకవి నందిని సిధారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లిని మార్చటం అంటే తెలంగాణ ప్రతీకలను మార్చటమేనని, శిల్పుల గిరాకీ కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు అదే శిల్పులు ‘నాడు కేసీఆర్ ప్రభుత్వంతో ఖర్చుపెట్టించారు..ఈనాడు ఈ ప్రభుత్వంతో ఖర్చుపెట్టిస్తున్నారు’ అని వాపోయారు. తెలంగాణ సాంస్కృతిక సోయిలేనివాళ్లే వెయ్యేండ్ల బతుకమ్మను లేకుండా చేశారని మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
మీ సాహితీసేవ, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్రను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని సత్కరిస్తామంటే తిరస్కరించారని ప్రచారం జరుగుతున్నది.. నిజమేనా?
నిజమే. ప్రభుత్వం నుంచి ఒక అధికారి ఫోన్ చేశారు. మిమ్మల్ని ప్రభుత్వం గౌరవించాలని అనుకుంటున్నది.. పెద్ద మొత్తంలో క్యాష్‌తోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారని ఆ అధికారి చెప్పారు. వారితో నేనొకటే చెప్పాను. ఓవైపు తెలంగాణ అస్తిత్వం, సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తూ మరోవైపు ఈ సత్కారాలెందుకు అని చెప్పి తిరస్కరించాను.
బహుశా మీకు పెద్ద మొత్తం అంటే కోటి రూపాయలు అని తెలియకపోవచ్చు?
కోటి కాదు అంతకన్నా ఎక్కువైనా సరే.. కొట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లిని, ఆ తల్లిచేతిలో బతుకమ్మను తీసేసి గౌరవిస్తామంటే ఎట్లా అంగీకరించాలని నాతో మాట్లాడిన అధికారితో స్పష్టంగా చెప్పిన.
ప్రభుత్వం ఎందుకిలా చేసిందనుకుంటున్నారు?
ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇవన్నీ చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం గ్యారెంటీ మాత్రమే అమలవుతున్నది. ఇంకా రైతు రుణమాఫీ, రైతుబంధు, దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చే పింఛన్లేవీ అమలు కావటం లేదనేది సత్యం. అది వారికీ తెలుసు. అప్పులు అప్పులు అంటూనే ఇంత ఖర్చుతో ఈ ఉత్సవాలేమిటి? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చటం అంటే చర్చ అంతా గ్యారెంటీలను వదిలేసి ఉత్సవం వైపు మళ్లాలనే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తున్నది. సమస్యలు కానివాటిని సమస్యలుగా చేసి వాటిమీదికి దృష్టి మరల్చాలనే ఆలోచన వీళ్లకు ఉన్నదని నేను భావిస్తున్న.
ప్రస్తుతం ఉన్న తెలంగాణతల్లి కవిత రూపంలో ఉన్నదని ఆరోపిస్తున్నారు? దీనికి మీ సమాధానం?
బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. ప్రపంచంలో ఈ ప్రాంతానికి లేని విశిష్ట సాంస్కృతిక ధార ఉన్నది. ప్రజల జీవన విధానం ఉన్నది. దీన్ని తొలగించి ఒక పార్టీ చిహ్నాన్ని పెట్టడం రాజకీయం కాక మరేమవుతుంది? కవిత రాకముందు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే బతుకమ్మ ఉన్నది. బతుకమ్మను ఉద్యమవ్యాప్తిలో భాగంగా, సంస్కృతి వికాస కోణంలో వివిధ రూపాల్లో కవిత విస్తృత పరిచింది. అంత మాత్రంచేత ఇప్పుడున్న తెలంగాణ తల్లిని కవితకు ఆపాదిస్తూ నిరాకరించటం సరైంది కాదు. సీఎం భావించినా ఆయన చుట్టూ ఉండేవాళ్లు, సాహిత్యకారులు, కళాబృందాలు ఇలా ఎవరు మాట్లాడినా వాళ్లు వాళ్ల అవసరాల కోసం మాట్లాడుతున్నారని భావించాలి. బతుకమ్మ పాటలు, పండుగలు, చెరువులు, వ్యవసాయం, సంస్కృతిక వికాసం, కాకతీయల కాలం నుంచే ఉన్నదని, జానపదులు అంతకన్నా పూర్వమే ఉన్నదని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డల సంస్కృతిని ఒక పార్టీకి అప్పచెప్పటం, ఆపాదించటం చేస్తే ఒప్పుకోను.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లాంటివాళ్లు కూడా స్వాగతిస్తుంటే మీరు ఇలా?
కూనంనేని సాంబశివరావు ఒక ఎమ్మెల్యే. చరిత్ర మీద అవగాహన, భావజాలానికి సంబంధించిన నాయకుడు మాట్లాడుతూ ‘అప్పుడు కేసీఆర్ ఏ పార్టీని పిలవలేదు. మమ్మల్ని కూడా పిలవలేదు’ అన్నారు. వారొక విషయం గుర్తుంచుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడో.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో రూపొందించిన విగ్రహం కాదది. ఆ విగ్రహం రూపకల్పన 2006- 07లో జరిగింది. 18 ఏండ్లుగా తెలంగాణ తల్లిని విగ్రహరూపంలో ప్రతి తెలంగాణ బిడ్డ ఆరాధించుకున్నరు.
తెలంగాణ గ్రామీణ స్త్రీని మాతృమూర్తిగా కొలిచే రీతిలో కొత్త విగ్రహ రూపు ఉన్నదని శిల్పులు కూడా వివరణ ఇచ్చారు కదా?
శిల్పులకు గిరాకీ కావాలె. తమ గిరాకీ కో సం చరిత్రను మారిస్తే ఎలా? ఇదే శిల్పి నిన్నటిదాకా అమరధామం (అమరవీరుల స్మృతి చి హ్నం) చేశారు. ఆ పేరుతో ఆ ప్రభుత్వాన్ని ఖర్చుపెట్టించారు. ఇప్పుడు తెలంగాణ తల్లిపేరు తో ఖర్చు. ఆ ఖర్చులో మిగుల్చుకోవటం తప్ప ఇందులో ఆ శిల్పులకు తెలంగాణ సోయి ఎక్కడున్నది? శిల్పులను, కవులను ఈ ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలె. తెలంగాణ చైతన్యాన్ని, అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే మంచిది. ఏ గ్రామీణ మహిళ ఆ విగ్రహంలో ఉన్నట్టు నేను చూడలేదు. నాదీ పల్లెటూరే. వేల పల్లెలు తిరిగిన.. లక్షల మంది గ్రామీణ తల్లులను చూసిన. గ్రామీణ మహిళ చేతిలో పనిముట్టు ఉంటది. కలుపు కోతలప్పుడు కొడవలి, ఇతర పనులు చేస్తే పలుగూపార, ఒకవేళ పశువుల దగ్గర ఉన్న మహిళ అయితే ఆమె చేతిలో కర్ర, ఆఖరికి ఇంటిపనులు చేస్తే చీపురుకట్ట, బిడ్డకు అన్నం తినిపించే తల్లి.. ఇలా అనేక రూపాల్లో తల్లులను చూసిన.
కానీ, తీరిగ్గా అంత హాయిగా అభయహస్తం భరోసా పెట్టినట్టు ఉండే మహిళా మూర్తిని నేను ఎక్కడా చూడలేదు. అంతెందుకు ఒకవేళ దీవించే ఏ తల్లి అయినా తన చేయిని అలా పెట్టదు. తల్లి భావన ఆరాధనీయమైనది. దేవతలు ఉన్నారో లేదో తెలియదు కానీ, వారిపట్ల నమ్మిక, విశ్వాసం ప్రజల్లో ఉన్నది. తెలంగాణ తల్లిభావన ఉద్యమ చైతన్యాన్ని చూడవలసిన పద్ధతిలో చూడాలి. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మను తొలగించి అభయహస్తం పెట్టారు. ఆ చేయి ఎవరిది? గ్రామీణ మహిళ అని చెప్తూ ఎవరిని మోసం చేద్దామని? ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయిలేదని, తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ అమరుల పట్ల గౌరవం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నది. తెలంగాణ తల్లి విగ్రహంపై ఎవరికి తోచింది వారు చెప్తున్నరు. ఇప్పుడున్న బతుకమ్మలో ఉన్నది తెలంగాణకు గర్వకారణమైన నేత చీర, అదీ పోచంపల్లి చీర.. ఆ సంస్కృతిని అవమానిస్తరా?
గత ప్రభుత్వం తెలంగాణ తల్లికి రూపం ఇవ్వలేదని ఈ సర్కార్ అంటున్నది కదా?
ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారెంటీల్లో సాంస్కృతిక ప్రతీకలను మారుస్తామని చెప్పిండ్రా? ప్రకటించకుండా పనులు చేస్తున్నారంటే ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కదా! ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా తెలంగాణ ప్రతీకలు మారుస్తారా? తెలంగాణతల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం లేదు. గాంధీ విగ్రహం, అంబేద్కర్ ఎట్లా మారదో అట్లనే ఒక తల్లి విగ్రహాన్ని కూడా మార్చాల్సిన అవసరం లేదు. తెలంగాణ తల్లి విగ్రహం ఒక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏర్పాటు చేసిన రాజకీయ విగ్రహం కాదు. అది తెలంగాణ ఉద్యమం. ఉద్యమావసరాల కోసం రూపొందించుకున్న తల్లి. చారిత్రక సందర్భంలో ఏర్పాటు చేసుకున్న రూపమది. ఆ భావన ఎట్లా వచ్చింది? తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలంతా ఉద్యమం చేస్తున్నప్పుడు తెలుగుతల్లి ముక్కలు అయిపోతుందని మాట్లాడుతున్న సందర్భంలో దానికి ప్రతిగా, జవాబుగా తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. తల్లి భావన అనేది చైతన్యం పెంచేందుకు వచ్చింది. ఆ మాతృత్వభావన నుంచే భారతమాత, తమిళమాత, ఆంధ్రామాత అనే భావనలు. తెలుగు ప్రజల్లో సమైక్యభావనను కల్పించేందుకు తెలుగుతల్లి. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా తెలంగాణ తల్లి పుట్టింది. ప్రభుత్వం మారినప్పుడల్లా రూపంలో మార్పులు చేయడం, ప్రతీకల్లో మార్పు తేవడం, ఆ విగ్రహాలు కాదని, మరో విగ్రహం పెట్టడం అంటే విచ్ఛిన్న సంస్కృతి. పార్టీల మధ్య విద్వేషం ఉంటే ఉంచుకోండి.. కానీ, సంస్కృతి మీద విద్వేషం ఉండాల్సిన పనిలేదు.
ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రభుత్వం చెప్తుంటే మీరు దుబారా అంటున్నారు?
దుబారా కాక మరేమిటీ? ఎన్నికలప్పుడు ఆరు లిఖిత గ్యారెంటీలకు తోడు మౌఖికంగా ఏడో గ్యారెంటీ కూడా ఇచ్చారు. ప్రశాంతతను అమలు చేస్తామని చెప్పారు. దాన్ని ఏడో గ్యారెంటీ అన్నరు. ప్రజాస్వామిక వాతావరణాన్ని ఎక్కడ నెలకొల్పారు? ములుగులో ఎన్‌కౌంటర్ ఎందుకు జరిగింది? ఏడుగురు అజ్ఞాతనక్సలైట్లకు అన్నంలో విషంపెట్టి చంపించారని అంటున్నరు. విషం పెట్టి చంపినా, తూటాలతో చంపినా చంపుడు చంపుడే కదా? ఆ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వాళ్లు బంద్‌కు పిలుపు ఇచ్చిండ్రు. ఆ బందు పిలుపునాడే ఉత్సవం జరుపుకొన్నరు. అంటే ఓవైపు హననకాండ మరోవైపు ఉత్సవకాండనా? గత ప్రభుత్వం పరిష్కరించని పనులను ఈ ప్రభుత్వం పరిష్కరిస్తే మంచిపేరు వస్తది. లేకుంటే చెడ్డపేరు వస్తది. నిరసన వెల్లువెత్తుతది. కవులు, కళాకారులు, రచయితలు ప్రజల్లో అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని దించే చైతన్యం కూడా వస్తది. ఈ ప్రభుత్వం తెలంగాణ సోయితో, తెలంగాణ అస్తిత్వ చైతన్యంతో, గత చరిత్రపై గౌరవభావంతో ఉండాలి.
తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు ఏం చేస్తారు?
తెలంగాణ అస్తిత్వాన్ని నిర్మించేదే సాహిత్యకారులు! నిర్మించిందే సాంస్కృతిక ఉద్యమం! ఈ సాంస్కృతిక ధార లేకపోయి ఉంటే ఒక రాజకీయ పార్టీ ఇన్ని రోజులు ఉండేది కాదు. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారినప్పుడు ప్రశ్నించింది తెలంగాణ కవులు, రచయితలు అన్న విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు. తెలంగాణ సమాజం నిర్మించుకున్న ప్రతీకలను మార్చినా, అస్తిత్వాన్ని తొలగించినా సహించేది లేదు. కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతిని నిర్మించుకుంటూ వచ్చిన కవులు, కళాకారులు ప్రశ్నించకుండా ఉండలేరు. అస్తిత్వాన్ని నిర్మూలించే, నిర్వీర్యం చేసే భావనను కవులు, కళాకారులు ఎప్పుడూ ఒప్పుకోరు. నిజమైన తెలంగాణ ప్రేమికులు అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తరు.
నందిని సిధారెడ్డి
నమస్తే తెలంగాణ దినపత్రిక ఇంటర్వ్యూ
డిసెంబర్ 11.12.2024
No comments:
Post a Comment