09 November, 2021

మంజీరా రచయితల సంఘం సాహిత్య సభ మల్లారెడ్డి గార్డెన్స్, గజ్వేల్. తేదీ: 7-11-2021 *మానవసంబంధాలను* *పరిరక్షిద్దాం**-మరసం సాహిత్య సభలో* *వక్తలు* ప్రపంచీకరణ ముసుగులో సమాజంలో ధ్వంసం అవుతున్న మానవ సంబంధాలను పరిరక్షించేందుకు ప్రతి మానవతావాది స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక మల్లారెడ్డి గార్డెన్స్ లో ఆదివారం నాడు మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో  "సాహిత్యం - సామాజిక సంబంధాలు" అనే అంశంపై నిర్వహించిన సాహిత్య సభకు ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకులు కోయి కోటేశ్వర రావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషిని వింత మనిషిగా మార్చేసి మానవ సంబంధాలకు దూరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సామాజిక సంబంధాలను నెలకొల్పే సాహిత్యం వైపు దృష్టి సారించి కవులు, రచయితలు తమ కలాలకు మరింత పదునెక్కించాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి  మాట్లాడుతూ 35 ఏళ్ల  సుదీర్ఘ చరిత్ర మంజీరా రచయితల సంఘానికి ఉందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాహిత్యంలోనూ, ఉద్యమాల్లోనూ, ప్రజా జీవితంలోనూ మరసం క్రియాశీల పాత్ర పోషించిందని, ప్రజా సంబంధాలను, జీవితాలను, మానవీయ కోణాలను ఆవిష్కరించిందన్నారు. ప్రముఖ కవి, వక్త, గాయకులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజం పట్ల కవికి ఒక దృక్పథం ఉండాలన్నారు. కవిత, కథ, రచన చదివిన తర్వాత పాఠకుల్లో అన్యాపదేశంగా కొంత మార్పు సంభవిస్తుందని, ఆ మార్పు సామాజిక సంబంధాలకు ప్రేరణాత్మకంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం మంజీరా రచయితల సంఘం మూడున్నర దశాబ్దాలుగా కృషి చేస్తుందని దేశపతి అన్నారు. ఎఫ్.డి.సి ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక చైతన్యం, ఉద్యమాల చరిత్ర కలిగివున్న గజ్వేల్ ప్రాంతంలో మంజీరా రచయితల సంఘం గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, అదే స్ఫూర్తితో ఇవ్వాళ సాహిత్య సభను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్యానికి ఉన్న శక్తి గొప్పదని, తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు పోషించిన పాత్ర చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్ రావు మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను సైతం ఎదుర్కొని తన సాహిత్యంతో ప్రజల ఆదరాభిమానాలు, విశ్వాసాన్ని చూరగొన్న గొప్ప చరిత్ర మంజీరా రచయితల సంఘానికి ఉందన్నారు. మెతుకుసీమలో పురుడు పోసుకొని, ఉమ్మడి మెదక్ జిల్లాలో తన కార్యకలాపాలు కొనసాగించినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా మరసం గుర్తింపు పొందడం హర్షణీయమని దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ మంజీరా రచయితల సంఘం గజ్వేల్ లో సామాజిక ఉద్యమాలతో, ప్రజాజీవితంతో పెనవేసుకొని ఉందన్నారు. మెతుకుసీమలో మంజీర ప్రవాహంలాగే మరసం సాహిత్యం ప్రజల్లో ప్రవహించి ఎనలేని చైతన్యాన్ని అందించిందని విరాహత్ అభివర్ణించారు. మరసం అధ్యక్షులు కె.రంగాచారీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్థానిక మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి, వైస్ ఛైర్మెన్ జకియుద్దీన్, జెడ్పిటిసి మల్లేశం, ఏఎంసి అధ్యక్షురాలు మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపిపి అధ్యక్షురాలు అమరావతి, గజ్వేల్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వై.సురేందర్,టీటీఎఫ్ గజ్వేల్ జోన్ కన్వీనర్ మల్లికార్జున్, మరసం కార్యదర్శి సిద్దెంకి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంజీరా కవులచే కవిసమ్మేళనం జరిగింది.

No comments:

Post a Comment